టీడీపీ నేతలు తప్ప అందరూ బాధపడుతున్నారు..! వీళ్లెవరైనా సైకిల్‌కి ఓటేసిన మొహలేనా..?

కేంద్రంలో మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని కాకుండా ఉండే లక్ష్యంతో… చంద్రబాబునాయుడు.. చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి… చంద్రబాబు వేసిన అడుగు ఓ సంచలనమే. దీనిపై నిఖార్సైన టీడీపీ అభిమానులు, నేతలు ఎవరూ… వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఓ రకంగా సంతోషంగా ఉన్నారు. టీడీపీ ఉనికినే చాలెంజ్ చేస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి… జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండ ఉండాల్సిందేనన్న ఆవశ్యకత టీడీపీ నేతలకు శ్రేణులకు అర్థం అయింది. కానీ… ఈ విషయంలో బాధపడిపోతున్న వారంతా… వైసీపీ, బీజేపీ, జనేసన, టీఆర్ఎస్‌కు చెందిన నేతలే.

ప్రతి సందర్భంలోనూ రాజకీయ పార్టీలు అప్పటికప్పుడు.. తమ పార్టీకి ఏది మేలు చేస్తుందో అదే చేసుకుంటాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందనే వాదనను.. ఇప్పుడు ఇతర పార్టీల నేతలు చూపిస్తూ.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందనే దాకా వెళ్లిపోతున్నారు. వీళ్లేవరు.. తమ జీవితంలో ఒక్క సారి కూడా.. ఎన్టీఆర్ గురించి మంచి మాట చెప్పని వాళ్లే. ఇప్పుడు హఠాత్తుగా వీళ్లందరికి ఎన్టీఆర్ ఆత్మ గురించి చర్చకు వస్తోంది. నిజానికి .. ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టింది.. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం. ఆనాడు ఢిల్లీలో తిరుగులేని అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ గాంధీలు… అందర్నీ అవమానిస్తూంటే.. తెలుగు వాళ్లను లెక్క చేయకపోతూండటంతో…ఆత్మగౌరవ పోరాటంలో పార్టీ పెట్టారు. విజయం సాధించారు. అప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉంది కాబట్టి.. కాంగ్రెస్‌కు వ్యతిరేకం. ఆ స్థానంలో బీజేపీ ఉంటే.. బీజేపీకి వ్యతిరేకం అయ్యేది. అంటే.. ఇక్కడ పాయింట్ కాంగ్రెస్సా.. బీజేపీనా అన్నది కాదు.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీస్తే వారికి వ్యతిరేకంగా పోరాడటం. అంటే.. ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగానే టీడీపీ ఆవిర్భవించింది.

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవమే ఎన్టీఆర్ నేర్పారని చంద్రబాబు చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఎన్టీఆర్ బతికి ఉంటే… కచ్చితంగా ఈ పాటికి … కాంగ్రెస్ ఉన్న రాజకీయ ఫ్రంట్ రెడీ అయిపోయి ఉండేదే. నాలుగు దశాబ్దాల కిందటి కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు బీజేపీ. రూపం, మనుషులు, పేరు మారిందేమో కానీ… అదే స్వభావం. ఇంకా చెప్పాలంటే..అంతకు మించి ప్రజాస్వామ్య హననం సాగిస్తున్న పార్టీ అది. ఎన్టీఆర్ ఉన్నా…. కాంగ్రెస్ పార్టీతో కలిసి దేశాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా రంగంలోకి దిగేవారేనది టీడీపీ నేతల అభిప్రాయం. ఇప్పుడు కాంగ్రెస్ – టీడీపీ అని విమర్శలు చేస్తున్నవారెవరూ.. తమ జీవితంలో… ఎన్టీఆర్ గురించి కానీ.. టీడీపీ గురించి కానీ.. ఇంత ఆవేదన చెంది ఉండరు. బహుశా.. ఓటు కూడా వేసి ఉండకపోవచ్చు.

Leave a Reply

*